మార్కెట్‌లో గిట్టుబాటు కాని ఉల్లి ధరలు.. రైతుల ఆందోళన

-

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలైన పెద్ద గోప్లాపూర్, గూర కొండ, బండర్ పల్లి, మక్తల్, మరికల్, ధన్వాడ , నారాయణపేట మండలాల్లో అత్యధికంగా ఉల్లి సాగవుతుంటుంది. ఏటా 3 నుంచి 5 వేల ఎకరాల్లో ఉల్లిని రైతులు పండిస్తుంటారు. అయితే ఈ ఏడు కరోనా ప్రభావం , భారీ వర్షాల కారణంగా ఉల్లి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల కురిసిన ముసురు వానలతో చేతికొచ్చిన ఉల్లి పంట చేలోనే కుళ్లిపోయింది. అంతో ఇంతో మిగిలిన పంటను కోసి రైతులు మార్కెట్‌కు తరలిస్తే… అక్కడా రైతుకు చేదుఅనుభవమే ఎదురవుతోంది. ఉల్లిలో తేమ శాతం అధికంగా ఉండటం, నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో కొనే నాథుడు లేక.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్వింటా ఉల్లికి.. 100 నుంచి 150 రూపాయలు చెల్లిస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దిగాలుపడుతున్నారు.ఉమ్మడి పాలమూరులో పండిన ఉల్లిని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ లో విక్రయిస్తుంటారు రైతులు. ప్రతి బుధవారం ఉల్లిని వ్యాపారులు వేలం పాట ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఈ మార్కెట్‌ నుంచి ఉమ్మడి జిల్లా వినియోగదారులకు , వ్యాపారులకు అత్యధికంగా ఉల్లి సరఫరా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version