స్మార్ట్ ఫోన్లు అన్న తరువాత వాటికి బ్యాటరీ పవర్ అత్యంత ముఖ్యమైంది. ప్రస్తుతం వస్తున్న అనేక ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ సహజంగానే లభిస్తోంది. ఇక ఐఫోన్ల విషయానికి వస్తే వాటిల్లో ఆండ్రాయిడ్ ఫోన్లంతటి బ్యాటరీ కెపాసిటీ ఉండదు. కానీ ఆండ్రాయిడ్‌కు పోటీగా అవి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. కానీ ఫోన్‌ను వాడుతున్న కొద్దీ బ్యాటరీ పనితనం తగ్గుతుంది. అయితే ఐఫోన్లలో బ్యాటరీ హెల్త్, పనితనం చెక్ చేసుకునేందుకు ఓ సులభమైన టూల్‌ను అందిస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటే..
యాపిల్ సంస్థ 2018లో ఐఓఎస్ 11.3ని ప్రవేశపెట్టింది. అందులో బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసుకునే టూల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దానికి పలు మార్పులు, చేర్పులు చేసి యాపిల్ మరింత మెరుగ్గా ఆ టూల్‌ను అందిస్తోంది. ఇక ఆ టూల్ కోసం ఐఫోన్‌లోని సెట్టింగ్స్ అనే విభాగంలోకి వెళ్లి అందులో ఉండే బ్యాటరీ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
తరువాత బ్యాటరీ హెల్త్‌పై ట్యాప్ చేయాలి. అక్కడ బ్యాటరీ హెల్త్ చెక్ చేయవచ్చు. ఐఫోన్ 500 సార్లు పూర్తిగా చార్జింగ్ అయితే అప్పుడు 80 శాతం హెల్త్ ఉంటుంది. 100 శాతం హెల్త్ ఉంటే బ్యాటరీ సరిగ్గా పనిచేస్తున్నట్లే లెక్క. అలా కాకుండా హెల్త్ శాతం తగ్గుతుంటే బ్యాటరీ పనితనం తగ్గుతున్నట్లు భావించాలి. బ్యాటరీ హెల్త్ 50 శాతానికి చేరుకుంటే దాన్ని మార్చుకోవడమే మంచిది. లేదంటే ఫోన్ అకస్మాత్తుగా ఆగిపోవడమో, చార్జింగ్ తక్కువగా రావడమో జరుగుతుంది.
ఇక ఐఫోన్‌కు చెందిన బ్యాటరీ హెల్త్ బాగాలేకపోతే ఫోన్ మీకు పలు నోటిఫికేషన్లను పంపిస్తుంది. అవి ఇలా వస్తాయి.
1. Your battery is currently supporting normal peak performance.
2. This iPhone has experienced an unexpected shutdown.
3. Your battery’s health is significantly degraded.
పై మూడింటిలో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఐఫోన్‌కు చెందిన బ్యాటరీ బాగాలేదని అర్థం చేసుకోవాలి. దీంతో వెంటనే బ్యాటరీని మార్పించాల్సి ఉంటుంది. ఇలా ఐఫోన్లలో బ్యాటరీ హెల్త్‌ను, పనితనాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.