నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై చిదంబరం స్ట్రాంగ్ కౌంటర్

-

రూపాయి విలువ క్షీణించడం లేదని, డాలర్‌ విలువే బలపడుతోందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. నిర్మలమ్మ వ్యాఖ్యలపై చిదంబరం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. రూపాయి బలహీనపడటం లేదని, డాలర్‌ విలువే బలపడుతోందని వ్యాఖ్యానించారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే రూపాయి విలువ ఆశాజనకంగానే ఉన్నట్లు చెప్పారు. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు సాధారణంగా చెప్పే ‘మేం ఓడలేదు.. వాళ్లే గెలిచారు’ అన్నట్లుగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

‘‘రూపాయి బలహీనపడట్లేదు.. డాలరే బలపడుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది అక్షరాలా నిజమే..! ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి లేదా పార్టీ కూడా ఎప్పుడూ ఇలాగే ‘మేం ఓడిపోలేదు. అవతలి పార్టీనే గెలిచింది’ అని చెబుతుంటారు’’ అంటూ ఆర్థిక మంత్రికి చురకలంటిస్తూ చిదంబరం ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news