ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాగే క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ ని ఈడీ ప్రశ్నించడం కూడా పలు సంచలనాలకు దారితీసింది. ఈ వ్యవహారంలో పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారని కథనాలు కూడా వస్తున్నాయి. అయితే చీకోటి మాత్రం ఈ విషయంలో బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. గోవా లాంటి రాష్ట్రంలో క్యాసినో చట్ట బద్దంగా నిర్వహిస్తున్నారని, చట్ట పరిధిలోనే తాము క్యాసినో ఆడిస్తున్నామని చీకోటి చెబుతున్నారు.
అయితే చీకోటి క్యాసినో నిర్వహకుడైన…అసలు వ్యవహారం హవాలా అని ఆ మధ్య కథనాలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన ఈడీ దగ్గర నుంచి రాలేదు. ప్రస్తుతానికి ఈడీ విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా చీకోటి మీడియాలో హల్చల్ చేశారు. ప్రతి చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే చీకోటి మాట్లాడుతూ… క్యాసినో కేసులో క్లీన్‌చిట్‌తో బయట పడతానని.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరతానని చెప్పుకొచ్చారు.
క్యాసినోకు వివిధ పార్టీలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు వచ్చారని, సినీ తారలకు ప్రచారానికి డబ్బులు చెల్లించిన మాట వాస్తవమే అని చెప్పారు. చినజీయర్ స్వామికి తనకు మధ్య గురుశిష్యుల బంధం మాత్రమే ఉందని, అలాగే రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి గాని, ఆర్ధికపరమైన సంబంధాలు లేవని అన్నారు. గ్యాంబ్లింగ్‌లో టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నేతలంతా ఆడతారని, అది సరదా అని, చట్టబద్ధంగానే క్యాసినో నిర్వహిస్తున్నానని ఛేప్పుకొచ్చారు.
ఇక వల్లభనేని వంశీ మంచి స్నేహితుడని, నానితో పరిచయం ఉందని అయితే ఆర్థికపరమైన లావాదేవీలు లేవన్నారు. ఇలా చీకోటి ప్రతి అంశంపై క్లారిటీ ఇస్తూ వచ్చారు. కానీ ఈడీ విచారణలో ఏం తేలుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైగా రాజకీయాల్లోకి వస్తానని అంటున్నారు…మరి చీకోటి ఏ పార్టీలోకి వస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారనేది క్లారిటీ లేదు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఉంటారా? ఏపీ రాజకీయాల్లో ఉంటారా అనేది తెలియలేదు.