చైనా భారత్ పై పరోక్ష యుద్ధం చేస్తోందా..?

-

ఓవైపు సరిహద్దుల్లో భారత్ ను చికాకుపెడుతున్న చైనా.. మరోవైపు సైబర్ వార్ తో భారత్ ను దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పవర్ కట్ చేసి అంధకారమయం చేయాలని ప్లాన్ చేసింది. ఓ అమెరికా సంస్థ బయటపెట్టిన విషయాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అమెరికా సంస్థ రిపోర్టును చైనా ప్రభుత్వం ఖండించినా.. ముందు జాగ్రత్త చర్యగా అన్ని పవర్ గ్రిడ్ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లో చిరాకు పెట్టిన చైనా ఇప్పుడు భారత్ తో పరోక్ష యుద్దానికి‌ సిద్దమైంది.


గత ఏడాది జూన్‌లో గల్వాన్‌ దగ్గర భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత నాలుగు నెలలకు.. అంటే అక్టోబర్‌లో ముంబయిలోని ఒక పెద్ద పవర్ గ్రిడ్ ఫెయిలవడానికి మధ్య సంబంధం ఉందని, దీని వెనుక చైనా హస్తం కూడా ఉందనే విషయం తెరపైకి వచ్చింది. చైనా ప్రభుత్వానికి సంబంధించిన ఒక హాకర్ల గ్రూప్ మాల్‌వేర్ ద్వారా భారత్‌లో కీలకమైన పవర్ గ్రిడ్లను టార్గెట్ చేసుకుందని అమెరికా సంస్థ నివేదికలో వెల్లడైంది. అయితే 2020 అక్టోబర్‌లో ముంబయిలో పవర్ బ్లాకవుట్‌ కావడానికి చైనా లేదా పాకిస్తాన్‌కు చెందిన ఏదైనా సైబర్ దాడే కారణం అనడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసింది. ఈ ఘటనకు సైబర్ దాడి కారణం కావచ్చని, మాల్‌వేర్ ద్వారా పవర్ గ్రిడ్‌ను టార్గెట్ చేశారని ఆ రిపోర్టులో చెప్పారు.

చైనా మీద సైబర్ దాడుల ఆరోపణలు కొత్త కాదు. అమెరికా ఇంతకు ముందు కూడా చైనా సైబర్ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. తమ దేశంలోని ఐదు ప్రైవేటు కంపెనీలు, ఒక కార్మిక సంస్థకు సంబంధించిన అంతర్గత పత్రాలు, వ్యాపార రహస్యాలను చైనా ఆర్మీ అధికారులు దొంగిలించారని 2014లో అమెరికా ఆరోపించింది. అమెరికాతోపాటూ ఆస్ట్రేలియా, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు కూడా చైనా రకరకాల సైబర్ దాడులు చేసినట్లు ఆరోపించాయి. చైనా దగ్గర సైబర్ దాడులు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆర్మీ ఉందని నిపుణులు చెబుతున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ పేరుతో ఇది పని చేస్తుంది. 2015లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆర్మీలో ఎన్నో మార్పులు చేశారు. అప్పుడే దీనిని ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ఎఫ్‌కు ఇలాంటి దాడులు చేసే పూర్తి పూర్తి సామర్థ్యం ఉంది. ఈ ఫోర్స్‌లో ఎంతమంది ఉన్నారు, దానికి హెడ్ ఎవరనే వాటిపై పక్కా సమాచారం బయటకు తెలీదు. ఒక అంచనా ప్రకారం ఈ ఫోర్స్‌లో ఉన్న వారి సంఖ్య వేలల్లో ఉంది.

చైనా హ్యాకర్లు ముంబై తర్వాత హైదరాబాద్ ను కూడా టార్గెట్ చేశారన్న వార్తలు కలకలం రేపాయి. ముందుజాగ్రత్త చర్యగా పాస్ వర్డ్ లు మార్చేశామని తెలంగాణ ట్రాన్స్ కో , జెన్ కో ప్రకటించాయి. అయితే కీలకమైన విద్యుత్ వ్యవస్థలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలు వాడటమే సైబర్ దాడులకు ఊతమిస్తోందనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సరఫరా వ్యవస్థ పై చైనా నుంచి సైబర్‌ దాడులకు ప్రయత్నాలు జరుగు తున్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ హెచ్చరించింది. చైనాకు చెందిన కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్లు.. తెలంగాణ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ తోపాటు తెలంగాణ ట్రాన్స్‌కో కంప్యూటర్‌ సిస్టంలతో కమ్యూనికేట్‌ కావడానికి ప్రయత్నిస్తున్నాయని, విద్యుత్‌ వ్యవస్థ భద్రత దృష్ట్యా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది.

ఆధునిక ప్రపంచంలో హ్యాకింగ్ యుద్ధం కంటే ప్రమాదకరమైనది. ఈ విద్యలో చైనా బాగా ఆరితేరింది. అత్యంత కీలకమైన వ్యవస్థల్ని హ్యాక్ చేయడం ద్వారా ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయడమే డ్రాగన్ కంట్రీ అసలు ఉద్దేశం. ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశంగా చెప్పే అమెరికా నుంచి చిన్న దేశం వరకూ అందరికీ.. చైనా హ్యాకర్లంటే దడే. హ్యాకింగ్ అనేది చైనాలో ఓ పరిశ్రమ స్థాయిలో అభివృద్ధి చెందింది. ప్రభుత్వమే బహిరంగంగా ప్రోత్సహిస్తుండటంతో… హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఎథికల్ హ్యాకర్లు సమస్యను సాల్వ్ చేయడానికి ఉపయోగపడితే… అన్ ఎథికల్ హ్యాకర్లు.. కొత్త సమస్యలు సృష్టిస్తారు. చైనా సైబర్ ఆర్మీ మొత్తం అన్ ఎథికల్ హ్యాకర్లతో నిండిపోయింది. దేశ ఆర్థిక మూలాలు దెబ్బతీయటానికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మాల్ వేర్ ను చొప్పిస్తోందని ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ పరోక్ష యుద్దాన్ని భారత్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version