సైనిక ఆయుధ సాంకేతికతలో చైనా మరో మైలురాయిని అందుకుంది. సరికొత్త లేజర్ ఆయుధం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేతికి వచ్చినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది. పైకి చెప్పనప్పటికీ, ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలన్నది చైనా మనసులో మాట అని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగానే చైనా ఆయుధాల తయారీలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది.
తాజాగా చైనా ప్రమాదకర ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడైంది. ఇది లేజర్ ఆధారిత ఆయుధం. దీంతో, అంతరిక్షంలో తిరిగే
శాటిలైట్లను సైతం ధ్వంసం చేయొచ్చు. ఈ లేజర్ ఆయుధాన్ని మరింత శక్తిమంతం చేసే మరో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చైనా రూపకల్పన చేసింది. అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతను వెలువరించే లేజర్ ఆయుధాలు త్వరగా వేడెక్కకుండా వాటిని చల్లబరిచే కొత్త టెక్నాలజీని కూడా డ్రాగన్ అభివృద్ధి చేసింది.
ఈ టెక్నాలజీ సాయంతో లేజర్ ఆయుధాలు ఎంతసేపైనా ప్రయోగించే వీలుంటుంది. లేజర్ ఆయుధం వేడెక్కకుండానే అవసరమైన శక్తిని తాజా కూలింగ్ టెక్నాలజీతో అందించవచ్చు. ఈ ఆయుధం నుంచి వెలువడే లేజర్ కిరణం రోదసిలోకి సైతం దూసుకెళ్లగలదని, అడ్డొచ్చిన ఏ వస్తువునైనా బూడిదగా మార్చేస్తుందని తెలుస్తోంది. దాంతో చైనా తన ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలను దెబ్బతీసి, ఆయా దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలను కుప్పకూల్చగలదు.