సరిహద్దుల వద్ద భారత్‌తో కయ్యానికి కాలు దువ్విన చైనా ఎట్టకేలకు వెనుకడుగు వేసింది. గాల్వన్ లోయలో చాలా రోజుల నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన డ్రాగన్ దేశం ఎట్టకేలకు తమ బలగాలను ఆయా ప్రాంతాల నుంచి వెనక్కి పిలిపించింది. ఇటీవల మోదీ లేహ్‌లో పర్యటించాక చైనా వైఖరిలో మార్పు వచ్చింది. అందుకనే చైనా గాల్వన్ లోయ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పెరగడం వల్ల కూడా చైనా తమ బలగాలను గాల్వన్ లోయ నుంచి వెనక్కి రప్పించి ఉంటుందని అంటున్నారు. చైనా సైనికులు దాదాపుగా 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు సరిహద్దుల్లో చైనా, భారత్‌లకు నడుమ ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, ఇకపై ప్రశాంత వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు.
చైనా నిజానికి భారత్‌లోని భూభూగాన్ని ఆక్రమించింది. గాల్వన్ లోయలో రెండు కిలోమీటర్ల దూరం పాటు చైనా భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చింది. ఈ క్రమంలోనే ఆ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఇటీవల ఘర్షణ చోటు చేసుకోగా అందులో 20 మంది భారత జవాన్లు మరణించారు. 40కి పైగా చైనా సైనికులు మరణించినట్లు తెలిసింది. అయితే ఆ తరువాత భారత్ చైనాపై దూకుడుగా వ్యవహరించింది. 59 చైనా యాప్‌లను నిషేధించడంతోపాటు ప్రధాని మోదీ లేహ్‌లో పర్యటించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు మద్దతు లభించింది. ఈ క్రమంలో చైనా వెనక్కి తగ్గక తప్పలేదు. అందుకనే వారు తమ ఆర్మీని 2 కిలోమీటర్లు వెనక్కి రప్పించారు. అయితే చైనా సైనికులు పూర్తిగా మన భూభాగం వదిలి వెళ్లారని నిర్దారించుకున్నాకే మన సైనికులను అక్కడి నుంచి వెనక్కి పిలిపిస్తామని భారత ఆర్మీ చెబుతోంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఇకపై ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.