కుప్పం పై ఫోకస్ పెట్టిన వైసీపీ ఎంపీ..హడలిపోతున్న స్థానిక కేడర్

-

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఇన్నాళ్లూ టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచింది ఒక ఎత్తు అయితే.. 2019లో వరించిన విజయం మరో ఎత్తు. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి చంద్రబాబుపై పోటీ చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్ చంద్రమౌళి.. మొదటి రౌండ్లో మెజారిటీ సాధించి టీడీపీ అధినేతకు షాక్‌ ఇచ్చారు. చివరకు చంద్రబాబు గెలిచినా.. ఆయన మెజారిటీ తగ్గించి సీఎం జగన్‌ దగ్గర శభాష్‌ అనిపించుకున్నారు చంద్రమౌళి. అయితే అనారోగ్యంతో చంద్రమౌళి చనిపోవడంతో కుప్పం వైసీపీల పరిస్థితులు మారాయి.

కుప్పంలో వైసీపీ వ్యవహారాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డికి తోడూ చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డెప్ప సైతం కుప్పం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. 2019లో ఎంపీగా గెలిచిన నాటి నుంచి దూకుడుగా ఉంటోన్న ఆయన.. తన పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల కంటే కుప్పానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును ఓడించటమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రూపొందిస్తున్న యాక్షన్‌ ప్లాన్‌ను ఎంపీ రెడ్డెప్ప అమలు చేస్తున్నారన్నది పార్టీ వర్గాల టాక్‌.

ప్రభుత్వం నిర్వహించే ప్రతి సంక్షేమ పథకాన్ని కుప్పంలో అట్టహాసంగా ప్రారంభిస్తూ.. పెద్దస్థాయిలో సభలు పెడుతున్నారట రెడ్డెప్ప. ఆ విధంగా జిల్లా కేంద్రం చిత్తూరు కంటే.. కుప్పంలోనే ఎక్కువగా కనిపిస్తున్నారట. స్థానిక వైసీపీ కేడర్‌కు కొత్తలో ఎంపీ రాక ఉత్సాహం తీసుకొచ్చినా.. తర్వాత ఆయన తీరు చూసి హడలిపోతున్నారట. ఎంపీ స్థాయిని మరిచి.. ప్రతి చిన్న కార్యక్రమంలోనూ రెడ్డెప్ప జోక్యం చేసుకోవడంపై ఇదేంటని ప్రశ్నిస్తున్నారట.

కుప్పం వైసీపీ ఇంఛార్జ్‌గా చంద్రమౌళి కుమారుడు భరత్‌ ఉన్నారు. ఎంపీ హడావిడి ముందు భరత్‌కు స్థానికంగా విలువే లేకుండా పోయిందని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతా ఆయనే చేసేస్తే మేమేం చేయాలని కామెంట్స్‌ చేస్తున్నారట. అలాగే ప్రతిరోజూ కుప్పంలో ఎంపీ పర్యటన ఫొటోలు పేపర్‌లో చూస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు.. రెడ్డెప్ప చిత్తూరుకు ఎంపీనా కుప్పానికా అని సెటైర్లు వేస్తున్నారట. మంత్రి పెద్దిరెడ్డి జోక్యం చేసుకుంటే కానీ రెడ్డెప్ప జోరుకు బ్రేక్‌ పడదని అనుకుంటున్నారట. మరి.. ఈ విషయం మంత్రి దృష్టికి వెళ్లిందో లేదో కానీ రెడ్డెప్ప మాత్రం పార్టీ వర్గాల్లో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version