సినిమాలో డబుల్ రోల్ అంటేనే భలే ఉంటుంది. కొందరు హీరోలు ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషించిన వారు ఉన్నారు. ఇక కమల్ హాసన్ అయితే ఏకంగా ఒకే సినిమాలో పది పాత్రలు పోషించి రికార్డు సృష్టించారు. కానీ ఇప్పుడు మరో హీరో ఏకంగా ఒకే సినిమాలో 20 పాత్రలు వరకూ పోషిస్తున్నాడట.
ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరో అంటారా.. ఆయనే చియాన్ విక్రమ్. హీరో కమల్‌హాసన్ తరువాత వైవిధ్యమైన పాత్రలు ధరించడంలో ముందున్న నటుడు విక్రమ్. ప్రస్తుతం విక్రమ్ చియాన్ 58లో చిత్రంలో సుమారు 20 పాత్రలను పోషించనున్నాడని తెలుస్తోంది. గతంలో దశావతారం చిత్రంలో కమల్ పది పాత్రల్లో నటించిన రికార్డును విక్రమ్ అధిగమించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని క్రిస్మస్ పండుగ నాడు విడుదల చేయనున్నారట. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో వచ్చే వేసవి నాటికి తెరపైకి తీసుకొచ్చేందుకు చిత్ర బందృం సన్నాహాలు చేస్తుంది. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకు దర్శకుడు. ఈ 58 చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక.
సినిమా అంటే ప్రాణం పెట్టే నటుల్లో విక్రమ్ ఒకరు. ఐ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా లెక్క చేయలేదు. అదీ విక్రమ్‌కి పాత్రలపై ఉన్న అభిమానం . ఇంకా ఈ 58 చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కె.ఎస్.రవికుమార్, క్రికెటర్ ఇర్ఫాన్‌ఖాన్‌లు కీలక పాత్రల్లో నటించనున్నారు. వయాకామ్ 18, 7 స్ర్కీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.