రాష్ట్రంలో రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే విత్తన చట్టం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్-జీఎస్టీ అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కమిటీ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, సభ్యులు మంత్రిని కలిశారు. కీలక వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా గ్రామాల్లో ఆదర్శ రైతుల నియామకం అంశం పరిశీలించాలని కోదండరెడ్డి మంత్రి తుమ్మల వద్ద ప్రస్తావించారు.
అనూహ్య వాతావరణ మార్పులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ పనుల కోసం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. యాంత్రీకరణ పథకం త్వరలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం, వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుందని, యంత్రాలు పని ముట్ల పై జీఎస్టీ ఎత్తి వేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని సూచించారు. ఆయా అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.