వైసీపీ సర్కార్ కు రోజురోజుకు కొరకరాని కొయ్యగా మారుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రతిపక్షాలు లేవనెత్తని అంశాలను సైతం తెర మీదికి తెస్తూ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. ఓవైపు పార్టీకి సీఎం జగన్ కి విధేయుడిని అంటూనే అనరాని మాటలని అనేస్తున్నారు రఘురామకృష్ణంరాజు. ఇటీవలే సీఎం జగన్ తిరుమల పర్యటన పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జగన్ మతం విషయంలో హిందువులు మాత్రమే కన్ఫ్యూజన్లో ఉండేవారని.. ఇప్పుడు తిరుమలలో జగన్ ను చూసిన క్రిస్టియన్లు కూడా కన్ఫ్యూజన్లో పడిపోయారు అంటూ కామెంట్ చేశారు రఘురామకృష్ణంరాజు.
అసలు జగన్ మతం ఏది అని అటు హిందువులు.. ఇటు క్రిస్టియన్లు కూడా అయోమయంలో ఉన్నారని… ఈ విషయం యొక్క స్వరూపానందేంద్ర స్వామి కి మాత్రమే తెలుసని.. ఆయన స్పష్టత ఇవ్వాలని కోరారు. ఇక ప్రభుత్వం ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలి అంటూ విధించిన నిబంధనను ఇటీవల ఎయిర్ పోర్ట్ లో జగన్ పాటించకపోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారని.. తాము జగన్ ని ఆదర్శంగా తీసుకుని మాస్కు పెట్టుకోము అంటున్నారని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణంరాజు.