శరీర రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారికి హాస్పిటల్ చేరాల్సిన అవసరం లేకుండానే ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా కోవిడ్ తగ్గుతున్న విషయం తెలిసిందే. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నిత్యం పౌష్టికాహారం తీసుకుంటున్నారు. అయితే జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే తద్వారా కోవిడ్ ప్రాణాపాయ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది.
స్పెయిన్‌లోని డెల్ మర్ హాస్పిటల్‌కు చెందిన సైంటిస్టులు అక్కడి బార్సిలోనాలో ఉన్న ఓ హాస్పిటల్‌లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 30 మధ్య అడ్మిట్ అయిన, చనిపోయిన కోవిడ్ పేషెంట్ల వివరాలను సేకరించి అధ్యయనం చేశారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. రక్తంలో జింక్ పరిమాణం ఎక్కువగా ఉన్నవారికి కోవిడ్ ప్రాణాపాయ ముప్పు తప్పిందని, వారు త్వరగా కోలుకున్నారని, వారి శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరిగిందని తేల్చారు.
ఇక జింక్ లోపం ఉన్నవారు కోవిడ్ బారిన పడితే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ సైంటిస్టులు తేల్చారు. అందువల్ల జింక్ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. మనకు జింక్ ఎక్కువగా.. పప్పు దినుసులు, నట్స్, సీడ్స్, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, డార్క్ చాకొలెట్లలో లభిస్తుంది.