ఆంధ్రావని వాకిట వైఎస్సార్సీపీ పాలనకు మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్ గతం కన్నా ఇప్పుడు దూసుకుపోతున్నారు. వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ అమలు చేస్తూ ఒక్క బటన్ ప్రెస్ చేయడంతోనే లబ్ధిదారుల జీవితాల్లో ఆనందం నింపుతున్నారు. అర్హత మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు వీలున్నంత ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ తనదైన పంథాలో పాలన సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్లీనరీ వేళ (ప్రతి నియోజకవర్గంకు సంబంధించి) చాలా అంటే చాలా అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్క బటన్ ప్రెస్ చేయడంతో సీఎం గ్రాఫ్ పెరిగిపోతోందని కానీ గ్రామాల్లో పనులు కాకుండా ఉంటే తాము గెలవడం కష్టమేనని తేలిపోతోంది. ఇదే ఇప్పుడు వైసీపీలో కలవరపాటుకు గురిచేస్తోంది. ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తామన్నా అవి కూడా ఎప్పుడు వస్తాయో అన్నది కూడా తేలని లేదా తెలియని స్థితిగానే ఉంది. సాధారణంగా గ్రామ స్థాయిలో చిన్న,చిన్న పనులు చేసేందుకు కూడా నిధులు లేకుండా పోతున్నాయని తెలుస్తోంది. కనీసం పారిశుద్ధ్య నిర్వహణకు బ్లీచింగ్ పౌడర్ లాంటివి కొనుగోలు చేయాలన్నా, పీహెచ్సీలకు మందులు కొనుగోలు చేసి ఇవ్వాలన్నా ఈ విధంగా ఏం చేయాలన్నా నిధుల లేమి వె న్నాడుతోంది. కొన్ని చోట్ల కింది స్థాయి ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఆగి ఆగి వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కార్యకర్తలు పనులు అందుకున్నాక ఆస్తులు అమ్ముకుంటున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సకాలంలో బిల్లులు రాకపోవడంతో ప్రతిచోటా ఇటువంటి దుఃస్థితే చోటుచేసుకుంటున్నదని తెలుస్తోంది.