మీరంతా మళ్లీ గెలవాలి.. ఎన్నికలకు ఇంకా 16 నెలలే.. సీఎం జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

-

సీఎం జగన్‌ నేడు నిర్వహించిన గడపగడపకు ప్రభుత్వం వర్క్‌షాప్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవ్వర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. ఇవాళ రాష్ట్రంలో కులాల మధ్య కాదు.. క్లాస్‌ల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవాడికి ప్రతినిధి ఎవరంటే మనమే. మనం నష్టపోతే పేదవారు నష్టపోతారు. మనం పొరపాటున కూడా అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు. వెన్నుపోటు రాజకీయాలు. అబద్ధాల రాజకీయాలు. ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు. పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు. ఇవీ రాజకీయాలు. అలాంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ ధ్యాస పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం రెండు, మూడు నిమిషాలు గడపండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం, మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది.

మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల టైమ్‌ మాత్రమే ఉంది. కాబట్టి, ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుభూతి లభిస్తుంది. ఎందుకంటే, ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనేది దయచేసి ఆలోచన చేయండి. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ప్రజా సేవకులం. అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది.. మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది. మంత్రులుగా ఉండేది. నేను సీఎంగా ఉండేది. అందుకే ఎదిగేకొద్దీ ఒదగాలి. ఈ అధికారం ఉండేకొద్దీ మనం ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే, నష్టపోతాం. అందుకే ప్రతి ఇంట్లో మనం వారితో కనీసం 5 నిమిషాలు గడిపితే, ప్రజల మద్దతు మనకు దక్కుతుంది. మనల్ని ఆదరిస్తారని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల (హై ఇంప్యాక్ట్‌ వర్క్స్‌–హెచ్‌ఐడబ్ల్యూ స్‌)కు సంబంధించి చూస్తే.. 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్ల పనుల ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చారు. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలు కాగా, ఆ విలువ రూ.662.14 కోట్లు.’ అని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version