పరిపాలనపై పట్టు సాధించే దిశగా సీఎం జగన్ మరో కీలక‌ నిర్ణయం

-

పరిపాలనపై మరింత పట్టు సాధించే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. మాట వినని అధికారులను దారిలోకి తెచ్చుకునేందుకు..వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా అఖిల భారత సర్వీస్ రూల్స్‌లో రాష్ట్రాలకున్న విశిష్ట అధికారాలని వినియోగించుకుంటూ..మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగన్ సర్కార్. తాజాగా జారీ చేసిన జీవోతో ఇతర అఖిల భారత సర్వీస్ అధికారుల పని తీరును సమీక్షించడం వాటి రిపోర్ట్‌ను ఆమోదించడం వంటివన్ని సీఎం చేతుల మీదుగా జరగాల్సి ఉంటుంది.

ఏపీ కేడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులకు సంబంధించిన సర్వీసు రూల్స్‌పై జ‌గ‌న్ స‌ర్కార్ కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కేడరులోని అఖిల భారత సర్వీసు అధికారుల వ్యక్తిగ‌త ప‌ని తీరును స‌మీక్షించే అధికారాన్ని సీఎంకి అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జీవో జారీ చేశారు. ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికలను..ఇక నుంచి ముఖ్యమంత్రే నేరుగా ప‌ర్యవేక్షించేలా మార్పులు చేస్తూ సీఎం ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏపీలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు సహా వివిధ కీలక శాఖలకు చెందిన అధికారుల పని తీరును మాత్రమే ఇప్పటి వరకు సీఎం సమీక్షించే వారు.

పౌర సేవలు మరింతగా ప్రజలకు చేరటం, పాలనా యంత్రాంగంపై నియంత్రణ లాంటి అంశాల్లో మెరుగైన ఫలితాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్క గవర్నర్ కార్యదర్శికి సంబంధించిన పని తీరు నివేదికను మాత్రమే..రాష్ట్ర గవర్నర్ ఆమోదిస్తారు. సర్వీసు అధికారుల బదిలీలు, పోస్టింగులు, కేంద్ర సర్వీసుల వంటి అంశాల్లో అధికారులకు సీఎం ఇచ్చే నివేదికే కీలకం కానుంది. ఏపీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం అఖిల భార‌త సర్వీస్ ఆధికారులను ప‌నితీరు పేరుతో త‌న చెప్పు చేతల్లో పెట్టుకునేలా ఉంద‌ని ప్రభుత్వ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

పరిపాలనపై మరింత పట్టు సాధించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అధికారులకు సీఎం ఇచ్చే నివేదికే కీలకం కావడంతో బాధ్యతగా పని చేస్తారని పారదర్శకత కు వీలుండి ప్రభుత్వానికి లాయల్ గా ఉంటారని జగన్ సర్కార్ లెక్కలేస్తుంది. దీనిపై భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చాడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version