మహాత్మా గాంధీ కలలు కన్న కీలకమైన అంశం గ్రామస్వరాజ్య స్థాపన. గ్రామాలను పరిపుష్టం చేయడం, గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడం.. రైతులను రాజులను చేయడం.. వారికి అన్ని విధాలా ప్రభుత్వాలు దన్నుగా నిలవడం.. వీటిని సాధించిననాడే దేశంలో గ్రామ స్వరాజ్యం పరిఢవిల్లుతుందని గాంధీ గట్టిగా చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసింది లేదు. ప్రపంచానికే రాజకీయ పాఠాలు చెప్పానని చెప్పుకొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏనాడూ గ్రామ స్వరాజ్యంపై దృష్టి పెట్టింది లేదు. కానీ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అనూహ్య విజయం సాధించిన వైసీపీ అధినేత మహాత్ముడి ఆశలు చిగురించేలా చేశారు.
గత ఏడాది అధికారంలోకి రాగానే అత్యంత కీలకమైన నిర్ణయం ద్వారా గ్రామ స్వరాజ్యానికి దన్నుగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు జగన్ దూకుడుగా ముందుకు కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, నగర, పట్టణ ప్రాంతాల్లో గ్రామ సచివాలయాలకు జీవం పోశారు. తద్వారా ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. ఎవరూ కూడా కొన్ని వందల కిలోమీటర్లు వచ్చి.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా.. అధికారుల కోసం ఎదురుచూడకుండా.. ప్రజల ఇళ్లకు కూతవేటు దూరంలోనే ప్రభుత్వం అన్ని పనులు చేసేలా ఈ సచివాలయాలను ఏర్పాటు చేశారు.
అదే సమయంలో యువతకు ఈ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అనూహ్య సంఖ్యలో ఉపాధి కల్పించారు జగన్. వాలంటీర్లుగా, సచివాలయ కార్యదర్శులుగా కూడా యువతకు అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో భారీ ఎత్తున రెండున్నర లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రతి వాలంటీరు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంతోపాటు.. ప్రజలకు అవసరమైన అన్ని అంశాల్లోనూ సాయం చేసేలా వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేశారు. దీంతో గ్రామీణ, పట్టణ వ్యవస్థల రూపు రేఖలే మారిపోయిన పరిస్థితి మనకు రాష్ట్రంలో కనిపించింది. మొత్తంగా చూస్తే.. గ్రామస్వరాజ్య స్థాపనలో కీలకమైన అడుగు పడిందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.