ఏపీ సర్కార్ ఈ మధ్యే రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి) కోసం సున్నా వడ్డీ రుణ పథకాన్ని పునరుద్ధరించింది. స్వయం సహాయక సంఘాలకు రూ.1,400 కోట్లు విడుదల చేస్తూ ఈ పథకాన్ని పునఃప్రారంభించారు సీఎం జగన్.. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 93.80 లక్షల మంది మహిళలు ఉన్న 8.78 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.. సున్నా వడ్డీ పథకం మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేసి, మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను జాబితా చేశారు. కాగా, ఈ నెల 26వ తేదీన స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఏపీలో చిరు వ్యాపారులకు కూడా గుడ్‌న్యూస్. నేడు ‘జగనన్న తోడు’ (ఏడో విడత) పథకం కింద లబ్ధి దారుల ఖాతాల్లో రూ.10 వేలు జమకానున్నాయి. ఈ ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు జమ చేయనున్నారు. మొత్తం 5,10,412 మంది లబ్ధిదారులకు రూ.560.73 కోట్లు విడుదల చేయనున్నారు. అలాగే రూ.11.03 కోట్ల వడ్డీ రీయంబర్స్ మెంట్ కూడా విడుదల చేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి 13వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు, హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి అండగా ప్రభుత్వం ఈ నిధుల్ని విడుదల చేస్తోంది. వడ్డీ వ్యాపారుల నుండి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నారు. చిరువ్యాపారులకు పెట్టుబడి సాయంగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు.