ఇప్పటివరకు జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి, అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీఆర్‌ఎస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మునిసిపాలిటీ, కార్పొరేషన్‌లో ఓడినా మంత్రి పదవులు ఊడతాయని గులాబీ బాస్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. టికెట్ల పంపిణీ, రెబల్స్‌కు బుజ్జగింపుల బాధ్యత ఎమ్మెల్యేలదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాబుమోహన్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉన్న ఆయనను పార్టీలోకి తీసుకుని .. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చినా నిలబెట్టుకోలేదని గుర్తుచేశారు. అందర్నీ కలుపుకుని వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని నేతలను హెచ్చరించారు. అలాగే 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నాం. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని కూడా తెలిపారు.