సీఎం చంద్రబాబును ఎదుర్కొనే ధైర్యం లేకనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. విజయవాడ రామవరప్పాడులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ జగన్పై విమర్శలు గుప్పించారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ ప్రజా దర్భార్ నిర్వహించడం హాస్యస్పదంగా ఉందన్నారు. ప్రజా దర్బార్ లో వచ్చిన ఫిర్యాదులను జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా..? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వడం లేదంటూ అసత్యాలు చెబుతున్నారన్నారు. జగన్ కి మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేసారు. శాసన సభకు రాకపోవడం అంటే ప్రజా స్వామ్యాన్ని అవమానించడమే అవుతుందన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారన్నారని.. 11 మంది శాసన సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని యార్లగడ్డ తెలిపారు. అసెంబ్లీకి రాకుండా జగన్ అవమానించారని యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు.