పంద్రాగస్టు వేదికగా మరోసారి కేంద్ర ప్రభుత్వం పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ సందర్భంగా, గోల్కండ కోటలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు “ఉచితాలు” అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమని మండిపడ్డారు.
కేంద్ర సర్కారు అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని.. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పారు. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయిందని.. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమౌతున్నదని వెల్లడించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారన్నారు. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారని.. ఈ దుర్మార్గాన్ని చూసి కచ్చితంగా స్వాతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని నిప్పులు చెరిగారు.