తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్‌.. సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

-

తెలంగాణలోని రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. నైరుతి రుతుపవనాల ఆగమనం మరో రెండు రోజుల్లో కావస్తుండగా.. రైతులకు రైతు బంధు నిధులపై కీలక ప్రకటన చేశారు సీఎం. వానకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 26 నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ సోమవారం ఆదేశించారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసిన అనంతరం, పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సుమారు 60 లక్షల మంది రైతులకు రైతుబంధు జమకానుంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు హరితోత్సవాన్ని నిర్వహించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. హరితహారం అంటే కాంగ్రెస్ నేతలు జోకులు వేశారన్న కేసీఆర్.. తెలంగాణాలో 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. ఒకప్పుడు వందల ఫీట్లు బోరు వేసిన నీళ్లు వచ్చేది కాదని అన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాపై సీఎం వరాల జల్లు కురిపించారు.

మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం ఈ బహిరంగసభలో ప్రకటించారు. ప్రతీ గ్రామ పంచాయితీకి రూ.15 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. BHELకు మెట్రో తీసుకొస్తామని..తుమ్మలూరుకు రూ.కోటి, తుక్కుగూడ, జల్ పల్లి మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రజలకు ఉచితంగా పండ్ల మొక్కలను పంపిణీ చేయాలనీ తాను సీఎస్ ను కోరుతున్నానని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version