సంక్షేమ పథకాల అమలులో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందునుండి తనదైన ముద్ర వేసుకుంది. కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజలను దగ్గర చేసుకుంటుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రెండు లక్షల మంది కల్లుగీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మొదటి దశలో 15 వేల మంది లబ్ధిదారులకు మోపెడ్స్ అందిస్తామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఈ పథకం అమలు కోసం 1200 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్ర కేబినెట్ అనుమతి రాగానే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వంలో కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నేతన్నలకు పథకం పేరుతో ఆర్థిక సాయం చేస్తుంది. అలాగే ముదిరాజ్ లకు ట్రాలీలను ఫ్రీగా అందించింది. మరోవైపు దళితుల అభివృద్ధి కోసం 10 లక్షలు పేరుతో దళిత బంధు ప్రకటించిన సంగతి తెలిసిందే.