తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటించారు. గాల్వాన్ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందించారు. అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో కలిసి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
కేసీఆర్ మాట్లాడుతుండగా పలుమార్లు నితీశ్ సమావేశం ముగించాలని సూచించారు. అయినా కేసీఆర్ ఆయనను కూర్చోమంటూ విలేకరుల ప్రశ్నలకు దీటుగా సమాధానమిచ్చారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. కేసీఆర్ సమాధానాలు సమావేశంలో నవ్వులు పూయించాయి.
అయితే ఈ ప్రెస్‌మీట్‌పై భాజపా వ్యగ్యంగా వాగ్బాణాలు సంధించింది. కేసీఆర్-నితీశ్ కుమార్ మధ్య సఖ్యత లేదనడానికి ప్రెస్‌మీట్‌ను చూస్తే తెలుస్తోందని భాజపా సీనియర్ నేత సుశీల్ మోదీ విమర్శించారు. కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో నితీశ్ ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయేందుకు అనేక సార్లు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వీడయోను పలువురు భాజపా నేతలు ట్వీట్ చేశారు.