చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రైతు వేదిక నిర్మాణం దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీటితో పాటు సమీక్షా సమావేశం లో రైతుబంధు సహాయం, ఇతర వ్యవసాయ అంశాలపై సుదీర్ఘ చర్చను నిర్వహించారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతు బంధు సహాయం ఇంకా ఎవరికైనా అందకపోతే వారికి ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రభుత్వం సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్పత్తిచేసే విత్తనాలను నిల్వ ఉంచేందుకు రూ. 25 కోట్లతో అతిపెద్ద ఆల్ట్రా మోడ్రన్ కోల్డ్ స్టోరేజ్ ని నిర్మించబోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక ప్రస్తుతం కరోనా కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని దృఢనిశ్చయంతో రైతుబంధు సాయం విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ విషయంలో అధికారులు ఎంతో నిశ్చయంతో వ్యవహరించి రైతులందరికీ సరైన సమయంలో రైతుబంధు సాయం అందించినట్లు సీఎం చెప్పుకొచ్చారు.