తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడే చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీకే ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది బీఆర్‌ఎస్ మాత్రమేనని , అందుకే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సభ్యులను గెలిపించుకోవాలని కోరారు. జనగామ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని గుర్తు చేశారు.తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని.. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని 420 హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో మాటలు చెప్పారని గుర్తుచేశారు. డిసెంబర్ 9వ తేదీన రూ.2 లక్షల రుణమాఫీపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.రైతు భరోసా కింద రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అయిన నెరవేరింద అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు నెలల సమయం అవుతున్న ఇంకా హామీలను అమలుచేయడం లేదని ఆరోపించారు.రేవంత్ రెడ్డి భాష తన వ్యక్తిత్వాన్ని చెబుతుందని.. ముఖ్యమంత్రి తన భాష మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ హక్కులను కాపాడాలని.. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.