తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి సారిగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 14-19 తేదీల మధ్య జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా హాజరు కానున్నారు. సమ్మిట్ కు కేంద్ర ప్రభుత్వం తరపున మాత్రమే కాక పలు రాష్ట్రాల నుంచి ముఖ్య మంత్రులు, మంత్రులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. రాష్ట్రం నుంచి సీఎం సహా పలువురు హాజరయ్యేది త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
ముసాయిదా షెడ్యూలు ప్రకారం ముఖ్యమంత్రి నేతృ త్వంలోని టీమ్ జనవరి 15న తెల్లవారుజామున బయలుదేరి తిరిగి 18న రిటర్న్ కానున్నట్లు సమాచారం. విదేశీ కంపెనీల ప్రతినిధులతో నాలుగు రోజుల పాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు వీరు చర్చలు జరపనున్నారు. గతేడాది సైతం జనవరి మూడో వారంలో జరిగిన టూర్ కు అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని టీమ్ పర్యటించింది. సుమారు రూ. 21 వేల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్లు కేటీఆర్ అప్పట్లో ప్రకటించారు.