సాధారణంగా ప్రతీ ఏడాది లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే ‘కన్వర్ యాత్ర’ రూటులో తినుబండారాలకు సంబంధించి ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు, సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలపై విపక్షాల నుంచే కాకుండా అధికార ఎన్డీయే భాగస్వాముల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఆదేశాల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రకు వెళ్లే మార్గంలోని దుకాణాలపై యజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని అనడం, మాంసం అమ్మకాలు నిషేధించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రయోజనాల కోసమే యూపీ సర్కార్ ఈ ఆదేశాలిచ్చిందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆమె ట్వీట్ చేశారు. ఈ చర్య ఆర్థికంగా ఒక వర్గం ప్రజలను బాయ్‌కాట్ చేయడమేనని, ఇది గర్హనీయమని అన్నారు.