ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆగ్రా పేరును మార్చాలని యత్నిస్తుందా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదట.
ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆగ్రా పేరును మార్చాలని యత్నిస్తుందా..? అంటే అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు సీఎం యోగి ఇప్పటికే ఆదేశాలిచ్చారని తెలిసింది. అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, మొఘల్‌సరై పేరును దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నగర్‌గా యోగి ప్రభుత్వం ఇప్పటికే మార్చేసింది. ఇక ఇప్పుడు ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని యోగి ఆలోచిస్తున్నారట.
అయితే చరిత్రలో ఆగ్రావన్‌గా ఉన్న పేరు ఆగ్రాగా మారిందా..? అసలు ఆగ్రాకు అంతకు ముందు ఏం పేరు ఉండేది ? తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని సీఎం యోగి యూపీలోని అంబేద్కర్ యూనివర్సిటీ చరిత్ర పరిశోధకులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఇక అక్కడి బీజేపీ ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మార్చాలని సీఎం యోగికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో ఆగ్రా పేరు మార్పు యత్నాలు వేగంగా జరుగుతున్నాయని సమాచారం.
అయితే ఆగ్రాకు అంతకు ముందు అక్బరాబాద్ అనే పేరు ఉండేదని, ఆగ్రావన్ అనే పేరు లేదని, అక్బర్ అప్పట్లో అక్బరాబాద్‌ను మొఘలుల రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాడని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఆ పేరు మార్చడం వల్ల విదేశీ టూరిస్టులు కన్‌ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని, ఆగ్రావన్‌గా పేరు మారిస్తే ఆగ్రాకు తాజ్ మహల్‌ను చూసేందుకు వచ్చే వారు అక్కడికి రాలేరని పలువురు టూరిస్టు ఆపరేటర్లు చెబుతున్నారు. మరి సీఎం యోగి ఆగ్రా పేరును ఆగ్రావన్‌గా మారుస్తారో, లేదో చూడాలి..!