గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజులపాటు గణేషుడు మండపాలలో పూజలు అందుకొని గంగమ్మ ఒడిలోకి చేరుకోనున్నాడు. ఇవాళ గణేశుడి నిమజ్జనం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో గణేశుడి నిమజ్జనం జరిగింది. నిమజ్జనానికి ముందు గణేశుడి వద్ద పెట్టిన లడ్డూను వేలం పాట వేస్తారు. ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. కొన్ని ప్రాంతాలలో గణేశుడు లడ్డు వేలలో వేలం పలకగా… మరికొన్ని చోట్ల లక్షలలో వేలం వేస్తారు. ఎంత ఖర్చు అయినా సరే కొంతమంది లడ్డును దక్కించుకుంటారు.

గణపతి వద్ద పెట్టిన లడ్డు సొంతం అవుతే వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, ఆర్థికంగా కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఆ నమ్మకంతోనే లడ్డును కొనుగోలు చేస్తారు. ఈ తరుణంలోనే..హైదరాబాద్లో రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లకు వినాయక లడ్డూ వేలంపాటకు వచ్చింది. హైదరాబాద్ రిచ్మండ్ విల్లాస్లో లడ్డూను వేలంలో రూ.2 కోట్ల 31 లక్షల 74 వేలకు దక్కించుకున్నారు కమ్యూనిటీ సభ్యులు. ఇక అటు నల్గొండ పాత బస్తీలో ఒకటో నెంబర్ గణేషుడి వద్ద లడ్డు కేవలం రూ. 5,00,116కు మాత్రమే పలికింది. గత సంవత్సరం ఇదే గణేశుడి వద్ద లడ్డు రూ. 13.50 లక్షలు పలికింది. దీంతో సభ్యులు నిరాశలో ఉన్నారు. సగానికి పైన లడ్డు ధర పడిపోయిందని బాధపడుతున్నారు.