ఎన్నికల్లో గెలుపోటములు సహజమని…ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా వరమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉంటే అధికార ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల తరఫున పోరాడవచ్చని ఆయన అన్నారు.ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరిగిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ…. ఆచరణకు సాధ్యం కానీ అబద్దాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
గత 10 ఏళ్ల సమయంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారెడుకాయ చేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. దాదాపు పట్నాలు సంవత్సరాలపాటు సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణను టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంచారని పేర్కొన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ కూడా తాను నిత్యం ప్రజల్లోనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు. కానీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ మాత్రం హైదరాబాద్ కి పరిమితమయ్యాడని కరీంనగర్ కి కొత్తగా నిధులు ఏమి తీసుకురాలేకపోయాడని విమర్శించారు.