ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నా, ఈ కరోనా టెన్షన్ మాత్రం పూర్తిగా వీడిపోయిందని చెప్పలేము. ఈరోజు కూడా 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ముందు సాధారణ ప్రజలకే పరిమితం అయిన ఈ కరోనా కేసులు ఇప్పుడు మాత్రం సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులని కూడా వదలడం లేదు. గత నెలలో కరోనా బారినపడిన కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. ఈరోజు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించారని చెబుతున్నారు.
ఈ మేరకు ఆయన కుమారుడు సోషల్ మీడియాలో ప్రకటించారు. నిజానికి అహ్మద్ పటేల్ కు అక్టోబరు 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయంది. నెల రోజులుగా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన కోలుకుని బయటకు వస్తారని భావిస్తున్న వేళ ఆయన ఆరోగ్యం విషమించిందని చెబుతున్నారు. కరోనా కారణంగా పటేల్ కు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని ఆయనకు ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. గుజరాత్ కి చెందిన ఈయన పార్టీ అధినేత్రి సోనియాకు అత్యంత నమ్మకస్తుడు అని చెబుతుంటారు.