ఎంపీ రంజిత్ రెడ్డి కనబడటం లేదని కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు డీసీసీ ఉపాధ్యక్షుడు బీంరెడ్డి, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం కుల్కచర్ల ఎస్ఐ శ్రీశైలంకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం మండలానికి ఒక్కసారి కూడా రాకపోవడం విడ్డూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, లక్ష్మయ్య, శ్రీనివాస్, హనుమంతు, షర్ఫుద్దీన్, రోహిన్, చిన్న పులింగ, వెంకటేష్, ఆనందం, భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. రేవంత్‌రెడ్డి కనబడుట లేదు’.. అనే పోస్టర్లు కంటోన్మెంట్ ప్రాంతంలో శుక్రవారం కలకలం రేపా యి. కార్ఖానాలోని విక్రంపురి బస్టాపులో ‘రేవంత్ మిస్సింగ్’ అంటూ పోస్టర్లు వెలిశాయి. వరుస వర్షాలతో నగరం అతలాకుతలమవుతుంటే ఎంపీ రేవంత్‌రెడ్డి ఎక్కడా పరామర్శించిన దాఖలాలు లేవని, 2020లో సైతం ఇలాగే వరదలతో నగరంలోని పలు ప్రాంతాలు మునిగిన సందర్భంలోనూ ఆయన కనిపించకుండా పోయారనే సందేశంతో పోస్టర్లు దర్శనమిచ్చాయి. మల్కాజిగిరి నుంచి రేవంత్ గెలిచినప్పటికి ఏడాది కాలంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించడం లేదని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని పోస్టర్లలో పేర్కొన్నారు.