రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా వైఫల్యాలతో ఆ పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హూజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్ లో నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలన చూశారని.. ఆ రెండు పార్టీలపై నమ్మకం పోయిందని ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఈటల పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలన పిదప కాంగ్రెస్ పాలనతో తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన మీద మాట్లాడుతున్న పార్టీ బీజేపీ ఒక్కటేనని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రేవంత్ రెడ్డికి దమ్ము లేదని, కాంగ్రెస్ పార్టీకి ముఖం లేదని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలుగా పని చేస్తున్నప్పుడు ప్రజా జీవితంలో అనేక బాధలుంటాయని.. అన్నింటిని దిగమింగుకొని అధిగమించిన వాడే ధీరుడు అన్నారు. సమస్య వస్తే.. పారిపోయేవాడు లీడర్ కాదని.. రాజకీయ పూలబాట కాదు ముళ్లబాట అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల.