మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

-

మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఉపఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఖరారు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్‌ వాస్నిక్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ తదితరులు పోటీ పడ్డారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్‌ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.

బీజేపీ అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డినే బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version