60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ ఒరగబెట్టిందేమి లేదని, యూపీఏ హయాంలో అన్ని కుంభకోణాలే జరిగాయంటూ బీజేపీ విమర్శలు చేస్తుంటే,మరోవైపు కాంగ్రెస్, బీజేపీ రాచరిక పాలనకు తెర లేపిందని, మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ ముస్లింలను ఉద్దేశించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలను వ్యతిరేకించడం బీజేపీ విధానం కాదని తెలిపారు.
నెహ్రూ ప్రధానిగా ఉన్న నాటి నుంచే విపక్షాలు తమపై ముస్లింల విషయంలో బద్‌నాం చేయడం ప్రారంభించాయని ,కేవలం వారి ఓట్లను దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీని ముస్లిం వ్యతిరేకులుగా చిత్రీకరించి కాంగ్రెస్ నేటికీ రాజకీయ పబ్బం గుడుపుకుంటుందని ,ఇక వారి ఆటలు సాగవని.. ముస్లింలలో కొందరు వాస్తవాలను తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు.ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు ముస్లిం మహిళల్లో ఆనందం చూశామని ,ఎన్నటికైనా.. కాంగ్రెస్ అబద్ధాలు బట్టబయలు అవ్వడం ఖాయమని అన్నారు.