హైదరాబాద్‌లోని పాత బస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముస్లింలు, ఇస్లాం మతాన్ని కించపరిచేలా యూపీకి చెందిన పూజారి యతి నరసింహానంద చేసిన వ్యాఖ్యలపై పాతబస్తీలోని ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. యూపీలోని దాస్నాదేవి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న ఆయన మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో యతి నరసింహానందకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
యతి నరసింహానంద ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు ముస్లింలు, ఇస్లాం మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ పూజారిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మొహమ్మద్ జుబైర్ అనే ఫ్యాక్ట్ చెకర్ ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా తాను నరసింహానందపై ఫిర్యాదు చేస్తూనే ఉన్నా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని సీరియస్ అయ్యారు. కాగా, నరసింహనందపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఎంఐఎం కోరనున్నట్లు తెలుస్తోంది.