ఐపీఎల్ లో సచిన్ వారసుడి ఎంట్రీ పై మొదలైన రచ్చ

-

ఐపీఎల్‌ వేలంలో సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్‌ తీసుకోవడంపై.. సోషల్‌ మీడియా వేదికగా విపరీతంగా చర్చ జరుగుతోంది. సచిన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టే..అర్జున్‌కు అవకాశం వచ్చిందంటూ ట్రోలింగ్‌ చేశారు కొందరు నెటిజన్లు. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం. అతనిలోని క్రీడా నైపుణ్యాల ఆధారంగానే కొనుగోలు చేశామని తెలిపింది. అర్జున్ ఆటతీరు ప్రతిభ ఈ మధ్యకాలంలో దారుణంగా ఉన్న ఎలా ఎంపిక చేశారన్నదాని పై ఇప్పుడు నెట్టింట పెద్ద రచ్చే నడుస్తుంది.

రాబోయే ఐపీఎల్‌ సీజన్‌ కోసం జరిగిన వేలం పాటలో… మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌ను బేస్‌ ప్రైస్‌ 20లక్షలకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. దీంతో, సహజంగానే దీనిపై ట్రోలింగ్‌ మొదలైంది. సచిన్‌ కోసమే.. అర్జున్‌ను తీసుకున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ముంబై ఇండియన్స్‌.. అదేమీ లేదని తేల్చి చెప్పింది. ఏ రూల్ ప్రకారం అర్జున్ ను ముంబై జట్టులోకి తీసుకున్నారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో బెటర్ రికార్డు లేకపోయినా, కేవలం సచిన్ కొడుకు అన్న ట్యాగ్ తోనే ఐపీఎల్ ఎంట్రీ దక్కిందంటూ విమర్శిస్తున్నారు. అయితే, మరి కొందరు అర్జున్ కు మద్దతు పలుకుతున్నారు.

అర్జున్‌ టెండూల్కర్‌లో ఉన్న నైపుణ్యం ఆధారంగానే.. ఎంపిక జరిగిందని చెప్పాడు ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్‌ మహేలా జయవర్ధనే. అర్జున్‌కు సచిన్‌ కుమారుడు అనే పెద్దట్యాగ్‌ ఉండటం సహజమనీ.. అయితే తాము బౌలింగ్‌ నైపుణ్యం ఆధారంగానే అతడిని ఎంపిక చేసుకున్నామనీ చెప్పాడు మహేల. సచిన్‌ మెప్పు పొందేందుకే తాము అర్జున్‌ను తీసుకున్నామన్న విమర్శల్ని కొట్టిపారేసింది ముంబై ఇండియన్స్‌. అర్జున్‌ సహజంగా లెఫ్టార్మ్‌ పేసర్‌, బ్యాట్స్‌మన్‌ కావడంతో తీసుకున్నామని ఆ ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్‌ అంబానీ స్పష్టం చేశారు.

అర్జున్‌ టెండూల్కర్‌ ముంబై ఇండియన్స్‌ తరపున ఆడబోతున్నందుకు… అతని సోదరి సారా తెందూల్కర్‌ మాత్రం సంతోషం వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అర్జున్‌ బౌలింగ్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. ”నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది నీది. క్రికెట్‌ నీ రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్‌ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు..” అంటూ పోస్టు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version