చైనా వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో మానవాళిపై దండయాత్ర చేస్తూనే ఉంది కరోనా వైరస్. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని భయపెడుతోంది.
కరోనా మహమ్మారి ఇండియాలో ప్రవేశించి రెండేళ్లు పూర్తయింది. 2020 జనవరి 27న దేశంలో తొలికేసు నమోదైంది. దేశంలో తొలిసారిగా కేరళలోని త్రిసూర్ లో కరోనా కేసు నమోదైంది. కేరళ నుంచి చైనాలోని వూహాన్ యూనివర్సిటీకి విహారయాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన ఓ విద్యార్థిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఫిబ్రవరి 2న కేరళలోని అలప్పుజా లో రెండో కేసు, ఫిబ్రవరి 3న కేరళలోని కాసర్ గఢ్ లో మూడో కేసు నమోదైంది. వీరిద్దరు కూడా చైనాలోని వూహాన్ నుంచే ఇండియాకు వచ్చారు. ఆ తరువాత మార్చి నుంచి వరసగా ఇండియాలో కరోనా కేసులు మొదలవ్వడం ప్రారంభం అయింది.
కరోనా దేశంలో గతేడాది అల్లకల్లోలం కలిగించింది. సెకండ్ వేవ్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇదిలా ఉంటే దేశీయంగా తయారైన వ్యాక్సిన్లు కరోనాకు అడ్డుకట్ట వేశాయి. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ దాదాపుగా ప్రజలందరికీ చేరింది. దీంతో ఓమిక్రాన్ వంటి వేరియంట్లు వచ్చినా.. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి.