కరోనా మహమ్మారి నిజంగా మన గండానికే వచ్చింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ నెమ్మదిగా ప్రపంచ దేశాల్లోని ప్రజలకు వ్యాప్తి చెందింది. దీంతో లక్షల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు, మరణాలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే మరికొద్ది వారాలకు, నెలలకో కరోనా ఎలాగూ తగ్గుముఖం పట్టడం ఖాయం. కానీ అంతటితో అయిపోయిందా..? అంటే కాదు.. అనే సైంటిస్టులు అంటున్నారు. ఎందుకంటే..?
కరోనా వైరస్ వ్యాప్తి మరికొన్ని వారాలు లేదా నెలలకు తగ్గినప్పటికీ.. సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఈ వైరస్ విజృంభించే అవకాశం ఉంటుందని.. శివ్ నాడార్ యూనివర్సిటీ, బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టీఐఎఫ్ఆర్) సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు తాజాగా తాము చేపట్టిన అధ్యయనాలకు సంబంధించి వివరాలను వెల్లడించారు.
చైనాలో కరోనా తగ్గిన కొందరికి ఇప్పుడు ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని.. కనుక మన దగ్గర కూడా వ్యాధి తగ్గినప్పటికీ.. అది పూర్తిగా తగ్గిపోయిందని అనుకోకూడదని.. మళ్లీ వచ్చేందుకు అవకాశం ఉంటుందని.. ఆ సైంటిస్టులు అంటున్నారు. ఇక జూలై, ఆగస్టు నెలల్లో సెకండ్ వేవ్ రూపంలో మరోసారి మన దగ్గర కరోనా విజృంభిస్తుందని వారంటున్నారు. అయితే సోషల్ డిస్టాన్స్ పాటించడం, కరోనా రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం.. తదితర పనులు చేస్తే.. ఆ వైరస్ రెండో సారి రాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుందని, లేదంటే.. కరోనా కేసులు రెండో సారి భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉంటుందని.. వారంటున్నారు.
అయితే భారత్‌లో కరోనా కొంత కాలానికి తగ్గినా.. మళ్లీ ఆ వ్యాధి తిరగబెడితే.. అప్పుడు నెలకొనే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని సైంటిస్టులు అంటున్నారు. ఈ క్రమంలో అప్పటి వరకు హాస్పిటళ్ల సంఖ్యను పెంచడం, టెస్టింగ్ సామర్థ్యం, పడకల సంఖ్యను పెంచడం.. వంటి పనులు పూర్తి చేస్తే.. కరోనా రెండోసారి ప్రబలినా దాన్ని ఎదుర్కొనేందుకు కావల్సినంత శక్తి భారత్ వద్ద ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. ఇక జూలై, ఆగస్టు నెలల్లో వర్షాకాలం ఉంటుంది కనుక.. ఆ సమయంలో సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరాలు ఉంటాయని.. అలాంటప్పుడు వారికి, కరోనా పేషెంట్లకు చికిత్స చేయడం కష్టతరమవుతుందని.. కనుక ప్రభుత్వాలు ఈ విషయంపై జాగ్రత్తగా ఆలోచించి.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. మరి ప్రభుత్వాలు అప్పటి వరకు ఏం చేస్తాయో చూడాలి..!