కోల్‌కత్తా : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల మధ్య ఘర్షణలకు కూడా కారణమవుతోంది. కరోనా భయాందోళన నేపథ్యంలో ఉత్తర కోల్‌కత్తాలోని డుమ్‌డుమ్ సెంట్రల్ జైలులో ఖైదీలు, జైలు సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఈ అల్లర్లలో కొందరు ఖైదీలు అధికారులపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా జైలులోని ఫర్నీచర్‌కు కూడా నిప్పుపెట్టారు. దీంతో జైలు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘర్షణలను అదుపుచేయడానికి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.
ఇండియాలో కరోనా సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో జైలులోని ఖైదీలు తమను విడుదల చేయాలని అడగటంతో ఈ ఘర్షణ జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనలో గాయపడిన పలువురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు జైలులో తిరుగుతూ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జైలు లోపల ఇతరులతో కలిసి ఉండటం వల్ల తమకు కరోనా వ్యాపిస్తుందని.. అందువల్ల బెయిల్ ఇవ్వాలని కొందరు ఖైదీలు జైలు అధికారులను కోరారు. ఇందుకు అధికారులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది.
అలాగే కరోనా నియంత్రణలో భాగంగా జైలు అధికారులు.. ఖైదీల కుటుంబసభ్యులు వారిని కలవడానికి ఇచ్చే అనుమతిని శుక్రవారం నుంచి నిలిపివేశారు. అలాగే మార్చి 31 వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందన్నారు. మరోవైపు పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపి ఎలాంటి చెడు రిమార్క్ లేని ఖైదీలకు 15 రోజులు పెరోల్ ఇవ్వాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ జైలులో కొందరు ఖైదీలకు కోపం తెప్పించాయి. దీంతో వారు జైలులో కొన్నిచోట్ల నిప్పు పెట్టడంతోపాటు, అధికారులపైకి దాడికి దిగారు. వెంటనే మూడు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి ఉజ్వల్ బిస్వాస్, ఉన్నతాధికారులు జైలులో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 283 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.