ముప్పు తప్పిందని ఊరట పొందినంతలోపే యూరప్ ను కరోనా మళ్లీ వణికిస్తోంది. మొదటి దశ కంటే భీకరంగా కొవిడ్ రెండో దశ భయబ్రాంతులకు గురిచేస్తోంది. అక్కడ ఒక్క రోజే 2.5 లక్షల మంది వైరస్ బారినపడటమే దీనికి నిదర్శనం. తొలి దశ తీవ్రంగా ఉన్న రోజుల్లోనూ ఈ స్థాయిలో పాజిటివ్‌లు రాలేదు. అప్పట్లో రోజువారీ మొత్తం యూరప్ కేసులు 35 వేలకు మించలేదు. ప్రస్తుతం మాత్రం పాత లెక్కలకు దాదాపు పది రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయ్.
యూరప్‌లో ప్రస్తుతమున్నది కొత్త రూపు సంతరించుకున్న కరోనా అని అంటున్నారు నిపుణులు. యూరప్ తో పోలిస్తే అమెరికా కథ భిన్నంగా ఉంది. అగ్ర రాజ్యంలో కరోనా రెండో దశ ప్రారంభమైందా? లేదా? అన్న దానిపై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే.. అమెరికాలో జూన్ నుంచి రోజుకు 30వేల పైగా కేసులొస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబరులో 50 నుంచి 60 వేల మధ్య నమోదయ్యాయ్. ప్రస్తుతం మాత్రం 90వేల పైగా పాజిటివ్‌లు రికార్డవుతున్నాయి. యూరప్ దేశాల సంగతి అలా ఉంటే.. శీతాకాలం, పండుగల తర్వాత భారత్‌లో కరోనా రెండో దశ సంగతేంటనే చర్చ సాగుతోంది.
దేశంలో సెప్టెంబరులో దాదాపు రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదయ్యాయ్. ప్రస్తుతం 50 వేలలోపునకు పడిపోయాయ్.