ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కొవిడ్-19) కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 6వేల మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరోపక్క ఈ మహమ్మారి నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు ఈ వైరస్ పనిపట్టే మందుల్ని తయారు చేయడంలో తలమునకలైన సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా రూపొందించిన ఓ టీకా(వ్యాక్సిన్)ను నేడు తొలిసారిగా సియాటెల్ లో ప్రయోగించనున్నట్లు అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సియాటెల్‌లోని వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా సోమవారం ఓ వ్యక్తిపై ఈ ట్రయల్స్ ప్రారంభించనున్నామని వెల్లడించారు. అయితే, దీన్ని అక్కడి ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ ప్రయోగానికి సంబంధించిన నిధులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సమకూరుస్తోంది.
అయితే ఈ వ్యాక్సిన్ పనితీరును పూర్తిస్థాయిలో ధ్రువపరచడానికి మాత్రం మరో 18 నెలలు వేచిచూడక తప్పదని పబ్లిక్ హెల్త్ అధికారులు చెబుతన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 45 మంది యువకులపై ఈ వ్యాక్సిన్‌ని ప్రయోగిస్తారు. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో పరిమాణంలో వ్యాక్సిన్‌ను ఇస్తారు. అయితే, ఈ క్లినికల్ ట్రయల్స్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు తెలిపారు. మరిన్ని లోతైన పరీక్షలు చేయడానికి ముందు చేసే ప్రయోగం మాత్రమే అని అధికారులు పేర్కొన్నారు.