ఈ ఏడాది పత్తి, మిర్చి ధరలు ఆల్ టైం హైకి చేరుకుంటున్నాయి. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈసారి అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి దిగుబడి కూడా ఎక్కువగా రాలేదు. దీంతో మార్కెట్ లో పత్తికి డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయంగా కూడా పత్తికి డిమాండ్ పెరగడంతో మద్దతు ధరకు రెండింతల రేటు పలుకుతోంది. దీంతో పత్తి దిగుబడి తక్కువగా వచ్చినా… ప్రస్తుతం ఉన్న ధరతో రైతులు పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువగా లాభాలు వస్తున్నాయి.
తాజాగా మరోసారి పత్తి ఆల్ టైం హై రేటు పలికింది. కర్నూల్ ఆదోని మార్కెట్ లో పత్తికి సూపర్ రేటు వచ్చింది. క్వింటాల్ పత్తికి రూ. 11,111 ధర పలికింది. దీంతో పత్తిని తీసుకువచ్చిన రైతుల మోహాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇదిలా ఉంటే గతంలో కరీంనరగ్ జిల్లా జమ్మికుంటలో క్వింటాల్ పత్తికి రూ. 10,510 ధర పలికింది. అప్పటి వరకు అదే రికార్డ్ ధర. అంతకుముందు వరంగల్ మార్కెట్ లో గతంలో క్వింటాల్ పత్తి రూ. 10,235 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్ లో పత్తికి డిమాండ్ పెరగడం వల్లే ధరలు పెరుగుతున్నాయని అధికారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆదోని మార్కెట్ లో పలికిన రేటు ఇప్పటికి ఇదే హైఎస్ట్ రేట్ అని అధికారులు చెబుతున్నారు.