ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బుధవారం జరిగిన నాటకీయ పరిణామాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మండలిలో ప్రభుత్వం, విపక్షం రెండూ కూడా బిల్లుల విషయంలో పట్టుదలగా వ్యవహరించడంతో గంట గంటకు కూడా పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులను మంత్రులు బెదిరించారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి.
ఈ తరుణంలో కొందరు మంత్రులు సహా వైసీపీ సభ్యులు మండలి చైర్మన్ పై దాడికి దిగారని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపణలు చేసారు. ఈ నేపధ్య౦లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేసారు. ఈ వీడియోలో మంత్రులు కొందరు, చైర్మన్ దగ్గరకు వెళ్లి వారిస్తున్నట్టు గా ఉంటుంది. ఈ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో, గమనించిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్,
అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఘటనను గ్యాలరీలో ఉన్న అందరూ వీక్షిస్తూ ఉంటారు. దేవాలయంలాంటి శాసనమండలిలో ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చలా వ్యవహరించిన వైకాపా ప్రభుత్వం తీరు, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్యవహారశైలిని ప్రపంచం ముందుకు తెచ్చేందుకు ఒక బాధ్యత కలిగిన శాసనమండలి సభ్యుడిగా ఈ బహిరంగలేఖ విడుదల చేస్తున్నాను అంటూ లోకేష్ ఈ వీడియో విడుదల చేసారు.