కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (30-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో గురు‌‌‌‌‌వారం (30-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. ఏపీలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 10,167 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,30,557కు చేరుకుంది. 69,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 1281 మంది చ‌నిపోయారు.

2. అయోధ్య రామ‌మందిర నిర్మాణ భూమి పూజ‌లో పాల్గొన‌నున్న అర్చ‌కుడు ప్ర‌దీప్ దాస్‌కు క‌రోనా సోకింది. క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అలాగే అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న మ‌రో 16 మంది పోలీసుల‌కూ క‌రోనా సోకింది. అయిన‌ప్ప‌టికీ ఆగ‌స్టు 5న కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌తో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

3. క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను క‌నిపెట్ట‌డంతోపాటు భార‌తీయ సైంటిస్టులు ట్ర‌య‌ల్స్ చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు. కరోనాపై అలుపెర‌గ‌కుండా పోరాటం చేస్తున్న వైద్యులు, సిబ్బందిని ఆయ‌న అభినందించారు.

4. ముస్లింలు అత్యంత ప‌విత్రంగా భావించే హ‌జ్ యాత్ర ప్రారంభ‌మైంది. కరోనా నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు మాత్ర‌మే సౌదీ అధికారులు అనుమ‌తి ఇస్తున్నారు. ఐసొలేష‌న్ పూర్తి చేసుకున్న యాత్రికులు మాస్కులు ధ‌రించి చిన్న చిన్న బృందాలుగా ఏర్ప‌డి మ‌క్కాను ద‌ర్శించుకుంటున్నారు.

5. తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ త‌న జన్మ‌దినం సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన 6 కోవిడ్ రెస్పాన్స్ ఆంబులెన్స్‌ల‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేశారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న స‌ద‌రు వాహ‌నాల‌ను జెండా ఊపి ప్రారంభించారు.

6. హార్స్ షూ అనే జాతికి చెందిన గ‌బ్బిలాల్లో ఎన్నో ద‌శాబ్దాల నుంచే క‌రోనా వైర‌స్ ఉంద‌ని పెన్సిల్వేనియా స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు తెలిపారు. గ‌బ్బిలాల నుంచే మ‌నుషుల‌కు క‌రోనా వ్యాపించి ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు.

7. కరోనా సోకిన వ్య‌క్తుల‌ను శున‌కాలు చాలా సుల‌భంగా గుర్తిస్తాయ‌ని జ‌ర్మ‌నీలోని వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు తేల్చారు. అందుకు శున‌కాల‌కు కొద్ది రోజులపాటు శిక్ష‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. అవి దాదాపుగా 94 శాతం క‌చ్చిత‌త్వంతో క‌రోనా రోగుల‌ను గుర్తిస్తాయ‌న్నారు.

8. బీసీసీఐ దుబాయ్‌లో పూర్తిగా బ‌యో సెక్యూర్ బ‌బుల్ వాతావ‌ర‌ణంలో ఐపీఎల్‌ను నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే ఆగ‌స్టు 2న జ‌రిగే స‌మావేశంలో ఐపీఎల్ స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ (ఎస్‌వోపీ) తాలూకు వివ‌రాల‌ను ఐపీఎల్ యాజ‌మాన్యం ఫ్రాంచైజీల‌కు అందివ్వ‌నుంది.

9. తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1811 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క రోజులోనే 13 మంది చ‌నిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60,717కు చేరుకుంది. మొత్తం 505 మంది చ‌నిపోయారు. 15,640 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 44,572 మంది కోలుకున్నారు.

10. దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 52,123 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. మొత్తం 35వేల మంది చ‌నిపోయారు. 5.28 ల‌క్షల యాక్టివ్ కేసులు ఉండ‌గా, 10 ల‌క్ష‌ల మంది రిక‌వ‌రీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version