కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (26-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,661 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13,85,552కు చేరుకుంది. ఒక్క రోజే 705 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 32,063కు చేరుకుంది. 8,85,577 మంది కోలుకున్నారు. మరో 4,67,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
2. ఏపీలో కరోనా వ్యాప్తి వివరాలను తెలుసుకునేందుకు అక్కడ విజయవాడ అర్బన్ మండల పరిధిలోని 6 వార్డుల్లో సీరో-సర్వేలెన్స్‌ను చేపట్టనున్నారు. ఈ క్రమంలో 6 వార్డుల్లో ఒక్కో వార్డుకు 600 మంది చొప్పున మొత్తం 3600 మంది శాంపిల్స్‌ను సేకరించి యాంటీ బాడీల టెస్టులు చేస్తారు.
3. ఏపీలో ఒక్క రోజే కొత్తగా 7,627 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92,298కు చేరుకుంది. 48,956 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 46,301 మంది కోలుకున్నారు. మొత్తం 1041 మంది కరోనా వల్ల చనిపోయారు.
4. పశ్చిమబెంగాల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి నెలలో రెండు సార్లు కరోనా సోకింది. సాధారణంగా ఒక్కసారి కరోనా సోకి కోలుకున్నాక వారి శరీరంలో యాంటీ బాడీలు ఉంటాయి. అందువల్ల రెండోసారి కరోనా రాదని అనుకునేవారు. కానీ అది నిజం కాదని తేలింది. అందువల్ల కరోనా నుంచి కోలుకున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
5. భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్‌కు జూలై 17న రోహ్‌తక్ పీజీ ఇనిస్టిట్యూట్‌లో ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ 6 మందిపై చేపట్టగా.. అందులో మొదటి అంకం పూర్తయింది. ఆ 6 మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. దీంతో రెండో పార్ట్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో త్వరలో ఫేజ్ 1 ట్రయల్స్ పూర్తవుతాయి.
6. కరోనాను అంతం చేయాలంటే ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ నిత్యం 5 సార్లు హనుమాన్ చాలీసాను పఠించాలని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ జరుగుతుందని, ఆరోజు ప్రజలు తమ ఇండ్లలో దీపాలను వెలిగించాలని అన్నారు.
7. కరోనా లాక్‌డౌన్ అనంతరం కొనసాగుతున్న అన్‌లాక్ 2.0 ప్రక్రియ జూలై 31వ తేదీతో ముగియనుంది. ఆగస్టు 1 నుంచి అన్‌లాక్ 3.0ని అమలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే అన్‌లాక్ 3.0 కి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. అందులో సినిమా హాల్స్, జిమ్‌లకు అనుమతులు ఇస్తారని తెలుస్తోంది.
8. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో ప్రసంగించారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్నారు. కార్గిల్ స్ఫూర్తితోనే కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వైరస్ ప్రారంభంలో ఉన్నంత ప్రాణాంతకంగానే ఉందని, దాని ప్రభావం ఏమీ తగ్గలేదని అన్నారు.
9. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు చేర్చే వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 8.14 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. మొత్తం 53 దేశాల నుంచి భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చారు. వందే భారత్ మిషన్ 5వ విడత ఆగస్టు 1 నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.
10. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారత్‌పై దాడికి కరోనాను ఉపయోగించుకోవాలని ఉగ్రవాదులకు పిలుపునిచ్చింది. వారు కరోనా వాహకాలుగా మారి దేశంపై దాడిచేయాలని పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఆన్‌లైన్ పబ్లికేషన్ వాయిస్ ఆఫ్ హింద్ లో భారత వ్యతిరేక ప్రచారం చేపట్టారు.