కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్రవారం (03-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,934కు చేరుకుంది. మొత్తం 206 మంది చనిపోయారు. 7,632 మంది కోలుకున్నారు. 9,096 మంది చికిత్స పొందుతున్నారు.
2. హైదరాబాద్ ప్రజలు కరోనా వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. హైదరాబాద్ సురక్షితమైన నగరం అని అన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రస్తుతం కోవిడ్ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు.
3. భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవ్యాక్సిన్‌ను ఆగస్టు 15వ తేదీ వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ ఆ సంస్థను కోరింది. ఇప్పటికే ఆ సంస్థకు ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించగా.. ట్రయల్స్‌ను వేగంగా పూర్తి చేసి ఆగస్టు 15వ తేదీ వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని ఐసీఎంఆర్ సూచించింది.
4. కరోనా మహమ్మారికి గాను మరో భారత కంపెనీ జైడస్ కాడిలా వ్యాక్సిన్‌ను సిద్ధం చేసింది. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోల్ బోర్డు శుక్రవారం అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం భారత్‌లో భారత్ బయోటెక్‌తోపాటు జైడస్ కాడిలా కూడా కరోనా వ్యాక్సిన్ రేసులో నిలిచింది.
5. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,25,544కు చేరుకుంది. మొత్తం 18,213 మంది చనిపోయారు. 3,79,893 మంది రికవరీ అయ్యారు. 2,27,439 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రికవరీ రేటు మొదటిసారిగా 60 శాతానికి చేరుకుంది.
6. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను జూలై 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. కేవలం కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రమే పరిమిత సంఖ్యలో విమానాలను నడిపిస్తామని ఆ సంస్థ తెలియజేసింది. అమెరికా, కెనడా, యూరప్, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకువచ్చేందుకు వందే భారత్ మిషన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపింది.
7. తిరుమల ఆలయంలో పనిచేసే 10 మందికి సిబ్బందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. వీరిలో ఒక అర్చకుడు, నలుగురు ఉద్యోగులు, సన్నాయి వాయిద్యకారులు ఉన్నట్లు గుర్తించారు. ఇక మరికొందరు భద్రతా సిబ్బందికి కూడా కరోనా వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆదివారం టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది.
8. తమిళనాడులో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1 లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 4,329 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,02,721కి చేరుకుంది. 1,385 మంది చనిపోయారు. ఇక దేశంలో లక్ష కరోనా కేసులు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు ఆవిర్భవించింది. గతంలో మహారాష్ట్రలో మొదట లక్ష కేసులు దాటాయి. ఇప్పుడు తమిళనాడు ఆ మార్కును అధిగమించింది.
9. భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్.. కోవ్యాక్సిన్‌కు గాను దేశంలో మొత్తం 12 చోట్ల క్లినికల్ ట్రయల్స్ చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు చోట్ల క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. తెలంగాణలో నిమ్స్‌లో, ఏపీలో కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో ఈ వ్యాక్సిన్‌కు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. ఈ మేరకు ఈ రెండు ఇనిస్టిట్యూట్లకు నోడల్ అధికారులను కూడా ఐసీఎంఆర్ నియమించింది.
10. కరోనా నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు, సెప్టెంబర్ 27వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు జరుగుతాయి. అలాగే సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్ష నిర్వహిస్తారు.