హుజూరాబాద్‌లో ఆందోళనకరం..ముంచుకొస్తున్న ముప్పు

-

కరీంనగర్ : కరోనా రెండో వేవ్‌ పూర్తిగా తగ్గకముందే కరీంనగర్ జిల్లాలో మూడోవేవ్ ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూవస్తున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం, పెళ్లిళ్లు, విందులు, షాపింగ్‌లంటూ తిరుగడం, ముఖ్యంగా రాజకీయ కలాపాలు పెరిగిపోవడం వల్లే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

జులై నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 1,195 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఈ నెల 13 వరకు 59 వేల 278 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 1195 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 13 రోజుల్లో పాజిటివిటీ సంఖ్య 2.01 శాతంగా ఉంది. జూన్‌ చివరి నుంచి 10 రోజుల్లో ఇది 1.50 నుంచి 1.75 వరకు ఉంటూ వచ్చింది.

 

ఇక జిల్లాలో 10 లక్షల 50 వేల జనాభా ఉన్నారు. 3లక్షల 50 వేలకు మందికిపైగా కరీంనగర్‌ పట్టణంలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 20 శాతం కరీంనగర్‌లో వస్తుండగా 30 నుంచి 34 శాతం కేసులు హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నమోదు అవుతున్నాయి. అది కూడా ఎక్కువగా హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో నమోదవుతున్నాయి. ఈ మండలాల్లో ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ సమావేశాలు ముమ్మరంగా జరుగుతుండడంతో కేసుల వ్యాప్తి జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాల్లో వెంటనే ఐసోలేషన్‌ కేంద్రాలను ప్రారంభించాలని, మండల టాస్క్‌ఫోర్స్‌ టీంలు గ్రామాల్లో పర్యటించి కొవిడ్‌ నియంత్రణ చర్యలను, పరీక్షలను, ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమాలను పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version