మాస్కులు ధరించకుండా అంతర్గత ప్రదేశాల్లో మాట్లాడడం వంటివి చేస్తే కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అంతర్గత ప్రదేశాలు అంటే.. ఇళ్లు, బార్లు, రెస్టారెంట్లు, ప్రజలు తిరిగే లోపలి ప్రదేశాలు ఏవైనా కావచ్చు.. వాటిల్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించకపోతే కోవిడ్ ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఉంటాయన్నారు.
సైంటిస్టులు చేపట్టిన పై అధ్యయనానికి చెందిన వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. కోవిడ్ ఉన్నవారు మాట్లాడేటప్పుడు వివిధ పరిమాణాల్లో శ్వాసకోశ బిందువులు విడుదల అవుతుంటాయి. కొన్ని చిన్నగా ఉంటాయి. కొన్ని పెద్దగా ఉంటాయి. అయితే పెద్ద బిందువులు వెంటనే కింద పడిపోతాయి. కానీ చిన్న బిందువులు గాలిలో ఉండే ప్రవాహం వల్ల కొంత ఎక్కువ దూరం వరకు వెళ్తాయి. అలాంటి సమయంలో కోవిడ్ ఉన్నవారు మాస్కులను ధరించకపోతే వారు మాట్లాడేటప్పుడు విడుదలయ్యే బిందువుల ద్వారా ఇతరులకు కోవిడ్ వ్యాప్తి చెందేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
కాగా సదరు అధ్యయనాన్ని చేపట్టిన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బిందువులు చాలా వరకు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. ఇవి గాలిలో కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంటాయి. ఇవి గాలి ప్రవాహాల ద్వారా చాలా దూరం వరకు వెళ్తాయని గుర్తించారు. అందువల్ల ఇళ్లతోపాటు బార్లు, రెస్టారెంట్లు వంటి అంతర్గత ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా అందరూ మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు.