తన్ని వస్తే ఒక అమౌంట్.. బెదిరిస్తే ఒక అమౌంట్.. కాలు, చేయి తీసేస్తే.. ఇంకో అమౌంట్.. ఇక మర్డర్‌కైతే పెద్ద మొత్తంలో ఇవ్వాలి. ఈ తరహా నేరాల రేట్ చార్ట్‌లను మనం సినిమాల్లోనూ చూశాం. నేరాలకు వసూలు చేసే ఫీజుపై డిస్కౌంట్ కూడా ఇస్తామంటూ సినిమాల్లో నటీనటులు కామెడీ చేస్తారు. అయితే నిజ జీవితంలోనూ ఇలాగే జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కొందరు రౌడీలు ఒక్కో నేరానికి ఒక్కో రేటును ఫిక్స్ చేసి ఏకంగా రేట్ చార్ట్‌నే తయారు చేశారు. అనంతరం ఆ చార్ట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ చార్ట్ వైరల్ అయింది. దాంట్లో బెదిరింపులకు రూ.10వేలు, చిన్నగా గాయపరిస్తే రూ.5వేలు, కొంచెం ఎక్కువగానే గాయపరిస్తే రూ.10వేలు, హత్య చేస్తే రూ.55వేలు ఫీజు తీసుకుంటామని రాసి ఉంది. దీంతో ఆ చార్ట్ వైరల్ అయి పోలీసుల కంటబడింది. ఈ క్రమంలో వారు రంగంలోకి దిగి ఆ చార్ట్‌ను అప్‌లోడ్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేశారు.
సోషల్ మీడియాలో అలా నేరాలకు చెందిన రేట్ చార్ట్‌ను అప్‌లోడ్ చేసింది అక్కడి చౌక్‌వాడా గ్రామానికి చెందిన ఓ జవాన్ కుమారుడని పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని వారు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని సదర్ పోలీస్ స్టేషన్ సీవో కుల్‌దీప్ కుమార్ తెలిపారు.